బంగారు వజ్ర , వైఢూర్య , మరకత మాణిక్య ఆభరణాలు ««ధరించి నిత్యం భక్తకోటిని కటాక్షిస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని అలంకరించే ఆభరణాలన్నీ దాదాపుగా వందశాతం నాణ్యత కలిగినవేనని నిపుణులు నిర్ధారించారు. ఆలయంలోని మూలమూర్తితోపాటు ఉత్సవమూర్తులకు అలంకరణ , ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో వినియోగించే ఆభరణాలు , వస్తువులు దాదాపుగా మూడు వేల పైచిలుకు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొన్ని ఆభరణాల్లో పొదిగిన వజ్రాలు , రంగురాళ్లు లక్షల్లో ఉన్నట్టు నిపుణులు లెక్కలు తేల్చారు.
ఆలయంలో ఫిబ్రవరి నుంచి చేపట్టిన వెంకన్న ఆభరణాల మదింపు , లెక్కింపు కార్యక్రమం మూడు దశల్లో పూర్తిచేశారు. ఈ మేరకు ఆభరణాలు లెక్కలు నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వం , హైకోర్టుకు త్వరలో నివేదిక సమర్పించేందుకు రంగం సిద్ధమైంది.
శ్రీవారి ఆభరణాలు విషయంలో పలు విమర్శలు వచ్చాయి. నెల్లూరుకు చెందిన బెజవాడ గోపాల్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో శ్రీవారి ఆభరణాల నాణ్యత , విలువ మదింపు కార్యక్రమానికి టిటిడి శ్రీకారం చుట్టింది. బంగారు , వజ్ర , విలువైన రంగురాళ్ల ఆభరణాలు , ఇతరలోహ ఆభరణాల నిర్దిష్ట విలువను నిర్ధారణ చేసే స్వయం ప్రతిపత్తి కలిగిన ముంబై , జైపూర్‌లోని జెమాలజీ సంస్థల సహకారాన్ని టిటిడి తీసుకుంది.
ఆయా సంస్థలకు చెందిన పలువురు నిపుణులను రప్పించి వారిచేత అన్ని రకాల ఆభరణాలను లెక్కించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శాశ్వత ప్రాతిపదికన ఫిబ్రవరి 4 న శ్రీవారి ఆలయంలోని వైకుంఠం ద్వారంలో ప్రత్యేకంగా టిటిడి సొంతంగా జెమాలజీ ల్యాబ్‌ను ప్రారంభించింది. బంగారు ఆభరణాల నాణ్యతను నిర్ధారించేందుకు రూ. 20 లక్షల వ్యయంతో ప్రత్యేక యంత్రం , వజ్రాల ఆభరణాల విలువ నిర్ధారణకోసం రూ. 12 లక్షల విలువైన రామన్ స్పెక్టోమీటర్ ఏర్పాటు చేశారు.
స్వామివారి ఆభరణాలు నమోదు చేసే 13 తిరువాభరణాల రిజిస్టర్ల ప్రకారం వాటి నాణ్యతను లెక్కించారు. వీటిలో మొదట బంగారు తర్వాత వజ్రాలు , చివరగా విలువైన కెంపు , వైడూర్య మరకత , మాణిక్యాలతో తయారైన ఆభరణాలను లెక్కించారు. తొలుత ఫిబ్రవరి , మార్చి రెండు నెలలకాలంలో బంగారు ఆభరణాలు , ఏప్రిల్ నుంచి జూన్ మొదటివారం వరకు శ్రీవారి వజ్రాభరణాలను లెక్కించారు. చివరగా ఈనెల 10 వ తేదీ వరకు వైౖఢూర్యాలు , మరకతాలు , మాణిక్యాలు , కెంపులు , గోమేదికం , ఇతర విలువైన రంగురాళ్ళతో తయారుచేసిన ఆభరణాలను మదింపు చేశారు.
దాదాపుగా అన్ని ఆభరణాల్లోనూ నాణ్యత వందశాతం ఉన్నట్టు నిపుణులు తేల్చారు. నాణ్యతను బట్టి ఆభరణాల విలువను మదింపు చేసి లెక్కకట్టినట్టు సమాచారం. ఈ మేరకు శ్రీవారి సర్వాభరణాలకు సంబంధించి ప్రత్యేక జాబితా సిద్ధం చేశారు. టిటిడి పాలకమండలి ,ఈవో , ఇతర ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాత సమగ్ర నివేదికను ప్రభుత్వం , కోర్టుకు సమర్పించనున్నారు. ఇకపై విరాళాల రూపంలో వచ్చే ప్రతి ఆభరణం నాణ్యత , విలువ అప్పటికప్పుడే టిటిడి జెమాలజీ ల్యాబొరేటరీలో లెక్కించి వాటికి ప్రత్యేకమైన కోడ్ నంబర్లు ఇవ్వనున్నారు.
తిరుమలేశుని అలంకరణ ఆభరణాలతోపాటు , దేవస్థానానికి మొత్తం ఉన్న సుమారు పదకొండున్నర టన్నుల బంగారు ఆభరణాల్లో ఏది ఎంత బరువు ? వజ్రాలు , వైఢూర్యాలు మాణిక్యాల వంటి రంగురాళ్ల విలువెంత... ? వంటి లెక్కలు జెమాలజీ నిపుణుల తేల్చారు. ఇందులో ఆకాశరాజు తన అల్లుడు శ్రీ వెంకటేశ్వరుడికి బహూకరించినట్టుగా విశ్వసిస్తున్న బంగారు కిరీటం నుంచి గత ఏడాది ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి సమర్పించిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం వివరాలు వరకు , అలాగే ఈనెల 10 వ తేదీ వరకు అనేకమంది దాతలు కానుకగా సమర్పించిన వివి«ధరకాల ఆభరణాలు , విలువైన వస్తువులు జెమాలజీ నిపుణుల జాబితాలో ఉన్నట్టు సమాచారం.
విశ్వసనీయత సమాచారం ప్రకారం జాబితాలోని శ్రీవారి మూలవిరాట్‌కు అలంకరించే 2 కిలోలకు పైగా బరువున్న ముఖ్యమైన ఆభరణాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా మరో వంద దాకా వివిధ రకాల బరువున్న ఆభరణాలు మూలవిరాట్ అలంకరణలో వాడుతున్నారు.
- మూలవిరాట్ మకర తోరణం 35.271 కిలోలు
- టిటిడి తయారు చేయించిన 5 సవర్ల సహస్ర నామమాల 31.700 కిలోలు
- 1985లో టిటిడి తయారుచేసిన వజ్రకిరీటం 27,938 కిలోలు
- బంగారు పీతాంబరం 19.400 కిలోలు
- శ్రీవారి బంగారు కిరీటం మ«ధ్య అలంకరించే శీమకమల పతకము 15,130 కిలోలు
- నాలుగు పేట గొలుసులతో కూర్చిన మొహరీల దండ 10.194 కిలోలు
- శ్రీవారి మూల రత్నాలు చెక్కిన బంగారు కిరీటం 10.700 కిలోలు
- శ్రీవారి బంగారు కిరీటం 9.743 కిలోలు
- ఒక వజ్రం పొదిగిన వామ్‌సెట్ బంగారు కఠి హస్తం 8.129 కిలోలు
- శ్రీవారి బంగారు గుండ్లు కలిగిన నగ 8.550 కిలోలు
- జంషెడ్ బంగారు కఠి హస్తం 8.129 కిలోలు
- బంగారు చతర్భుజ లక్ష్మీ హారం 6.500 కిలోలు
- వజ్రాలు పొదిగిన బంగారు పడి కత్తి 7.420 కిలోలు
- బంగారు పెద్ద బిందె 6.510 కిలోలు
- మూల వరుల తిరువాభరణం సహస్త్ర సాలిగ్రామాల నామావళి కమలములు 5.735 కిలోలు
- జంషెడ్ వైకుంఠ హస్తం , చైనుతో సహా 5.899 కిలోలు
- శంకు కవచము 4680 కిలోలు
- పాద కంటెలు 4.190 కిలోలు
- శంఖము 4.013 కిలోలు
- చక్రము 4.076 కిలోలు
- బంగారు పట్టియాలు పెద్దది 4.336 కిలోలు
- శ్రీ లక్ష్మీదేవి బిళ్ళల హారం 4.306 కిలోలు
- బంగారు గంటల మొలత్రాడు 3.085 కిలోలు
- జంషెడ్ కర్ణపత్రములు 3.098 కిలోలు
- బంగారు సూర్య కఠారి 3.617 కిలోలు
- అష్టోత్తర కాసుల దండ 3.220 కిలోలు
- మూలవరుల బంగారు పాదాలు 3.190 కిలోలు
- సాలిగ్రామ బంగారు హారాలు 3.930 కిలోలు
- మూలవరుల బంగారు కరపత్రాలు 3.205 కిలోలు
- బంగారు 5 వరుసల గోపు చైను 2.447 కిలోలు
- బంగారు తులసి హారం 2.396 కిలోలు
- కాసుల దండ 2.060 కిలోలు
- శ్రీవారి బంగారు యజ్ఞోపవీతం 2.925 కిలోలు
- భోగ శ్రీనివాసమూర్తి (ఉత్సవరులు) మకర తోరణం 2.341 కిలోలు
- రత్నాలు చెక్కిన బంగారు కమలం 2.333 కిలోలు
- రత్నాలు చెక్కిన వైకుంఠ హస్త కవచరేకు 2.284 కిలోలు
- వైకుంఠ హస్త నాగాభరణం 2.315 కిలోలు
- నవరత్నాలు మూడు సెట్లు - (తూకము లేదు)