తిరుమల, తిరుపతి దేవస్థానం ఆర్జితం సేవా టిక్కెట్ల కేసుకు సంబంధించి విచారణ నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రూపొందిస్తోంది. ఈ కేసు విషయమై ఉన్నతాధికారుల విచారణ కూడా ముగిసింది. ఇదివరకు విజిలెన్స్ విభాగం నిర్వహించిన విచారణపై ఉన్నతాధికారులు సమగ్ర పరిశీలన చేశారు. ఆ విభాగం డీజీ దినేష్‌రెడ్డి, ఐజీ అనురాధ, డీఐజీ హరీష్ గుప్తా సోమ, మంగళవారాల్లో విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులు హైదరాబాదు తిరిగి వెళుతూ విచారణలో పాల్గొన్న అధికారులకు సూచనలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరో పదిరోజుల్లో నివేదిక అందించాలనే సంకల్పంతో డీజీ ఉన్నారు. నివేదిక తయారీ సమగ్రంగా, నిష్పక్షపాతంగా ఉండాలని డీజీ ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. నివేదిక తయారవుతున్న తరుణంలో దేవస్థానంలో విస్తృత చర్చినీయాంశమైంది. ఆర్జితం కార్యాలయంలో ఇదివరకు పనిచేసిన వ్యక్తుల్లో ఆందోళన మొదలైంది. నివేదికలో ఎవరి పేర్లు ఉంటాయి?. గతంలో పనిచేసిన పాలకమండలి పెద్దల పాత్రను సూచిస్తారా.. లేదా?. ప్రభుత్వం ఏవిధమైన చర్య తీసుకుంటుంది.. అన్న అంశాలపై చర్చ మొదలైంది. ఈకేసు విచారణపై ఇదివరకు ప్రభుత్వం చిత్తశుద్ధిగానే వ్యవహరించినట్లు కనిపించింది. వ్యవహారం వెలుగులోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ ఉన్నతాధికారులు స్వయంగా విచారణలో పాల్గొన్నారు. నివేదిక అనంతరం చర్య తీసుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరించే తీరుపై అందరి దృష్టి పడింది.
|