ప్రభుత్వ శాఖలు, వర్సిటీల్లో విద్య, ఉద్యోగ, సౌకర్యాల కల్పనలో బీసీలకు అన్యాయం జరిగితే చర్యలు తప్పవని శాసనసభ బీసీ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తిప్పేస్వామి హెచ్చరించారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో గురువారం పలుశాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీకి సంబంధించి జేఈవో యువరాజ్, అధికారులతో ఆయన మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్ విధానంలోనూ బీసీలకు రిజర్వేషన్ పాటించేలా చూడాలని సూచించారు. టీటీడీలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతులు, సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. అనంతరం ఎస్వీయూ రిజిస్ట్రార్ జె.ప్రతాప్‌రెడ్డి, అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో బీసీలకు రిజర్వేషన్లు పాటించాలని సూచించింది. టైంస్కేల్ ఉద్యోగుల్లో బీసీల శాతం ఎంత ఉందనేది చెప్పాలన్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో బీసీ విద్యార్థులకు సీట్లు కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో పీజీ పూర్తయినా ఎస్వీయూలో టీసీలు ఇవ్వలేదని, దీంతో ఆగస్టు రెండు నుంచి జరిగే బీఎడ్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరు కాలేక పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
|