తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్టకు చేరిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసి, దేవుని సన్నిధిని ప్రక్షాళన చేయాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 7న తిరుమల కొండపైకి పాదయాత్ర చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తామని, తర్వాత చంద్రబాబుతో సహా అందరం కాలినడకన కొండపైకి వెళ్తామని, అనంతరం కొండపైన ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో మౌనంగా నిరసన తెలుపుతామని పార్టీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, లింగారెడ్డి వివరించారు. వారు గురువారం విలేఖరులతో మాట్లాడారు. 8న చంద్రబాబు శ్రీకాళహస్తి వెళ్లి కూలిపోయిన ఆలయ గోపురాన్ని పరిశీలిస్తారని తెలిపారు. తర్వాత కాణిపాకం ఆలయానికి వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకొంటారు. చంద్రబాబు ఆ ఆలయాలకు వెళ్లడం వల్ల యంత్రాంగలో కొంతైనా కదలిక వస్తుందని ఆశిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు. 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరుమల అపవిత్రమైపోయింది. ముందు స్వామివారి ఏడు కొండలను రెండు కొండలు చేసి మిగిలిన ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారానికి అనుమతివ్వాలని చూశారు. దానిపై వ్యతిరేకత రావడంతో ఆ జీవో రద్దు చేశారు. 2060 సంవత్సరం వరకూ స్వామివారి వస్త్రాలంకరణ సేవా టికెట్లను బ్లాక్ చేసుకొన్నారు. 1.94 లక్షల అభిషేకం టికెట్లను కూడా ముందే కబ్జా చేశారు. ధర్మకర్తల మండలి సభ్యుల్లో అధికులు ఈ టికెట్లను, కొండపైన గదులను బ్లాక్‌లో అమ్ముకొంటున్నారు. స్వామి వారికి కానుకగా వచ్చిన బంగారు నగలను ఏడాదికి ఒకటి రెండుసార్లు శుద్ధి చేసి కరిగించి బిస్కెట్లుగా మారుస్తారు. గతంలో ఈ శుద్ధిలో తరుగు 15 శాతం ఉండేది. కరుణాకర్‌రెడ్డి టీటీడీ అధ్యక్షుడైన తర్వాత తరుగు 30 నుంచి 35 శాతానికి పెరిగింది. కిలోలకొద్దీ బంగారాన్ని ఈ పేరుతో కొట్టేస్తున్నారు' అని ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. తిరుమలలో సేవా టికెట్ల కుంభకోణం నిజమేనని విజిలెన్స్ శాఖ ఉన్నతాధికారి దినేష్ రెడ్డి కూడా ధృవీకరించారని, ఎందరు పెద్దలున్నా వారిపై చర్య తీసుకోవాలని గోపాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
|