తిరుమల కొండపై కొలువైవున్న శ్రీ వెంకటేశ్వరస్వామివారి కీర్తి ఎల్లలు దాటి ఖండాతరాలకు విస్తరిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం ఆయనకు ఆలయాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే నాలుగు ఇతర దేశాలలో శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు , టిటిడి అనేక ఆలయాలు నిర్మించారు. అలాగే నిత్యం పూజలు జరుపుతున్నారు. అలాగే అమెరికాలోని న్యూజెర్సి , శాన్‌ప్రాన్స్‌కో నగరాలలో ఏడాది మేనెలలో శ్రీవారికల్యాణాలు దిగ్విజయంగా నిర్వహించడంతో టిటిడిపై మరింతగా ఒత్తిడి పెరిగింది. తమప్రాంతాలలో కూడా ఇలాగే శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాల్సిందిగా అనేక దేశాలనుండి ప్రతినిధులు టిటిడిని కోరుతున్నారు. కాగా అమెరికాలో జరిగిన శ్రీవారి కల్యాణానికి తయారుచేసి తీసుకెళ్ళిన ఉత్సవమూర్తులకు అక్కడ ప్రవాసాంధ్రులు నిత్యం పూజలు నిర్వహించడమే కాకుండా ఆలయాన్ని సైతం నిర్మిస్తున్నారు. సాక్షాత్తూ తిరుమలనుండి తమదేశానికి వచ్చిన దైవంగా కొలుస్తున్నారు. ప్రవాసాంధ్రులు అమెరికా న్యూజెర్సీ ప్రాంతలో 1500 ఎకరాలలో గురువాయూరప్ప ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయాలను కూడా అనుబంధంగా నిర్మిస్తున్నట్లు అక్కడి నిర్వాహకుడు , ప్రవాసభారతీయుడు రమణ ఆదివారం తిరుమలలో టిటిడి ఇఒ కృష్ణారావును కలిసి వివరించారు. వచ్చేనెలలో కుంభాభిషేకాన్ని ఘణంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. టిటిడి తమకు ఇచ్చిన ఉత్సవవిగ్రహాలకు నిత్యపూజలే కాకుండా వారంలో ఒకరోజు కల్యాణోత్సవం సేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|